TS Class 10 Telugu 3.
వ్యక్తీకరణ - సృజనాత్మకత
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో సమాధానాలు రాయండి.
(ఆ) "తెలంగాణ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాల వరకు దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి” అన్న కవి మాటలను మీరెట్లా సమర్థిస్తారు?
జ. అవును నిజమే పుట్టిన నేలమీద, పీల్చేగాలి మీద, తాగే నీటిమీద మరొకరి పెత్తనం, అజమాయిషీ, ఆజ్ఞలు వుంటే దుర్మార్గుల చేతుల్లో చిక్కుకున్నాయి అన్న కవి మాటలు నిజమనే సమర్థించవచ్చు. రజాకారులు, నవాబుల అరాచకాలతో కల్లోలితమైన తెలంగాణ గొప్పతనం తరాల తరబడి వారి చేతులతోనే చిక్కుకుని ఉండిపోయింది.
(ఆ) “తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము” అని దాశరథి ఎందుకన్నాడు ?
జ. తెలంగాణ గడ్డమీద తరాల తరబడి పుట్టిన ప్రతిబిడ్డా అణచివేత, అనాదరణతో బాల్యం నుంచే పోరాడవలసి వచ్చింది. అందుకనే దాశరథి బాల్యం నుండే ఇక్కడి బిడ్డలకు పోరు అలవడిందని అనటం కోసం గడ్డిపోచ కూడా కత్తి పడుతుందని అన్నారు.
(ఇ) తెలంగాణలో సంధ్యా భానువు మొదటిసారి ఉదయించిందని కవి ఎందుకన్నాడు ?
జ. అప్పటి వరకూ నవాబులు, రజాకార్ల దుర్మార్గాలతో నలిగిన తెలంగాణలో ఉదయాలూ, సాయంత్రాలూ చీకటితో నిండి ఉండేవి. తెలంగాణ యోధులు పోరాటాల ఫలితంగా వచ్చిన విజయం వల్ల సాయంత్రపు సూర్యుడు మొదటిసారి వెలుగులు చిమ్మినట్లైందని కవి ఆ విధంగా అన్నాడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాలలో జవాబు రాయండి.
అ) వీర తెలంగాణ పాఠ్యభాగ సారాంశాన్ని సొంతమాటల్లో రాయండి.
జ:అమ్మా! ఓ తెలంగాణ తల్లి! నీ పెదవులతో ఊదిన శంక ధ్వనులతో ఈ భూమండల మంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా! ఉదయించిన సూర్యునికిరణాలవలే ప్రీతి పొందిన పద్మాలవలే చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. అమ్మ తెలంగాణమా! నీ గొప్పతనపు విశేషాలు కొన్ని తరాలవరకు దుర్మార్గుల చేతులలో చిక్కుకొన్నాయి. ఇప్పుడు ఆ రోజులు గతించాయి. అడ్డంకులు తొలిగాయి. విచ్చుకున్న మెరుపు తీగల కాంతి రేఖలు బతుకుతోవ చూపే కాలం వచ్చింది. స్వచ్ఛమైన కాంతివంతమైన సంధ్యాసూర్యుడు మొదటిసారి ఉదయించాడు.అమ్మా! కోటి మంది తెలుగు పిల్లలను నీ ఒడిలో పెంచావు. వారికి వయసురాగానే చేతులకు కత్తులనిచ్చావు వజ్రాయుధమంతటి భుజపరాక్రమమిచ్చావు. రాజుతో తలపడడానికి ధైర్యమిచ్చావు. ఈ తెలంగాణ నేలలో ఎంత బలం ఉన్నదో కదా. ఈ తెలంగాణలో గడ్డిపోచకు కూడా కత్తి బట్టి ఎదిరించే శక్తి కలదు. గొప్ప రాజుగా పేరొందిన వాని గర్వాన్ని అణచేటట్లుగా యుద్ధం సాగించింది. ఏమి జరుగుతుందో తెలియక జగమంతా భయపడిపోయింది. దిగంతాలన్నీ ఆకాశంలో ఇంద్ర ధనుస్సుల పరంపరలతో సయ్యాటలాడాయి.తెలంగాణ స్వాతంత్య్ర పోరాటం ఒక సముద్రంలా మారింది. నాలుగువైపుల నుండి సముద్రాన్ని గడికోట్టి తెలంగాణ నేలంతా స్వాతంత్య్రపు నీటితో తడుపుతున్నారు. మతం అనే పిశాచి తన క్రూరమైన కోరలతో మా నేలను ఆక్రమించి మా గొంతులు కోస్తున్నప్పుడు దిక్కు తోచనప్పుడు, బ్రతకడమే భారమైనప్పుడు తెలుగుదనాన్ని కోల్పోలేదు. యుద్ధరంగములో రుద్రులు మెచ్చేటట్లు చివరికి విజయం సాధించాం. మంగళకరమైన జయధ్వనులు మోగాయి. నాటి నుండి నేటి వరకు శత్రువుల దొంగదెబ్బలకు ఓడిపోలేదు. శ్రావణ మాసపు మేఘంలా గర్జిస్తూ నా తెలంగాణ ముందుకు సాగుతూనే ఉన్నది పథాన.